139
సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన. 
1 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు. 
నన్ను గూర్చి నీకు అంతా తెలుసు. 
2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు. 
దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు. 
3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు. 
నేను చేసే ప్రతీది నీకు తెలుసు. 
4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే 
నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు. 
5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు. 
నీవు నెమ్మదిగా నీ చేయినామీద వేస్తావు. 
6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది. 
గ్రహించటం నాకు కష్టతరం. 
7 నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది. యెహోవా, 
నేను నీ నుండి తప్పించుకోలేను. 
8 నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు. 
పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు. 
9 యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు. 
పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు. 
10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి, 
ఆ చేతితో నన్ను నడిపిస్తావు. 
11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే, 
“పగలు రాత్రిగా మారిపోయింది. 
తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు 
12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు. 
రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది. 
13 యెహోవా, నా శరీరమంతటినీ* నీవు చేశావు. 
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు. 
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను. 
నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు. 
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు నా తల్లి గర్భంలో దాగి ఉండి, 
నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు. 
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు. 
ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు. 
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం. 
నీకు ఎంతో తెలుసు. 
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి. 
కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను. 
19 దేవా, దుర్మార్గులను చంపివేయుము. 
ఆ హంతకులను నా దగ్గర నుండి తీసివేయుము. 
20 ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు. 
వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు. 
21 యెహోవా, నిన్ను ద్వేషించే ప్రజలను నేను ద్వేషిస్తాను. 
నీకు విరోధంగా తిరిగే మనుష్యులను నేను ద్వేషిస్తాను. 
22 నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను! 
నీ శత్రువులు నాకూ శత్రువులే. 
23 యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము. 
నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము. 
24 చూచి నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము. 
శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము. 
* 139:13: శరీరము అక్షరార్థంగా మూత్రపిండాలు. ప్రాచీన ఇశ్రాయేలీయులు ఉద్రేకములు మూత్ర పిండాల్లో కేంద్రీకృతమైయున్నవని తలంచేవాళ్లు. గనుక ఈ వ్యక్తి తను పుట్టుటకు ముందే ఎలా అనుభవాన్ని పొందాడో అని దేవునికి తెలుసు అనే అర్థము కూడా వుండవచ్చు.
