యూదా చుట్టు పట్ల వున్న దేశాలను దేవుడు శిక్షించటం 
11
1 లెబానోనూ, అగ్ని ప్రవేశించి నీ దేవదారు వృక్షాలను* 
కాల్చివేసేలాగు నీ ద్వరాలను తెరువు. 
2 దేవదారు వృక్షాలు పడిపోయినందుకు సరళ వృక్షాలు విచారిస్తాయి. 
బలమైన ఆ చెట్లు దూరంగా తీసుకుపోబడ్డాయి. 
బాషానులోని సింధూర వృక్షాలు 
నరికి వేయబడిన అడవికొరకు దుఃఖిస్తాయి. 
3 విలపించే కాపరులను వినండి. 
శక్తివంతులైన వారి నాయకులు పట్టుబడ్డారు. 
యువకిశోరాల గర్జన వినండి. 
యొర్దాను నది వద్ద గల వాటి చిక్కటి పొదలన్నీ తీసుకుపోబడ్డాయి. 
4 దేవుడైన యెహోవా చెపుతున్నాడు, “చంపటానికి పెంచబడ్డ గొర్రెల విషయం జాగ్రత్త తీసుకో. 
5 వాటి నాయకులు యజమానులవలెను, వ్యాపారులవలెను ఉన్నారు. యజమానులు వారి గొర్రెలను చంపుతారు. అయినా వారు శిక్షింపబడరు. వ్యాపారులు గొర్రెలను అమ్మి ‘దేవునికి జయం, నేను భాగ్యవంతుడ నయ్యాను’ అని అంటారు. కాపరులు తమ గొర్రెల కొరకు విచారించరు. 
6 ఈ దేశంలో నివసించే ప్రజల కొరకు నేను విచారించను.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “చూడండి, నేను ప్రతివాడినీ తన పొరుగువానిచేత, రాజుచేత దూషింపబడేటట్లు చేస్తాను. వారి దేశాన్ని నాశనం చేసేలాగు నేను వారిని వదులుతాను. నేను వారిని ఆపను!” 
7 కావున చంపబడటానికి పెంచబడిన ఆ అభాగ్యపు గొర్రెల పట్ల నేను శ్రద్ధ తీసుకున్నాను. నాకు రెండు కర్రలు దొరికాయి. ఒక కర్రను “అభిమానం” అని, మరొక కర్రను “సమైక్యత” అని పిలిచాను. తరువాత నేను గొర్రెల పట్ల శ్రద్ద తీసుకోవటం మొదలు పెట్టాను. 
8 ముగ్గురు కాపరులను ఒక్క నెలలో సంహరించాను. నేను గొర్రెలపట్ల కోపించగా, వారు నన్ను ద్వేషించటం మొదలు పెట్టారు. 
9 అప్పుడు నేను ఇలా అన్నాను: “నేను వదిలి వేస్తాను! నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ తీసుకోను! చావు కోరేవారిని నేను చనిపోనిస్తాను. నాశనమై పోవాలని కోరుకొనేవారిని నేను నాశనం కానిస్తాను. ఇంకా మిగిలినవారు ఒకరినొకరు నాశనం చేసుకుంటారు.” 
10 తరువాత “అభిమానం” అనే కర్రను నేను తీసుకొని విరుగగొట్టాను. తన ప్రజలతో గల దేవుని ఒడంబడిక రద్దయినట్లు చూపటానికే నేనిది చేశాను. 
11 కావున ఆ రోజున నిబంధన రద్దయింది. నన్ను గమనిస్తున్న ఆ నిర్భాగ్యపు గొర్రెలకు ఈ వర్త మానం యెహోవా నుండి వచ్చినదని తెలుసు. 
12 అప్పుడు నేనిలా అన్నాను: “మీరు నాకు వేతనం ఇవ్వదలిస్తే ఇవ్వండి. వద్దనుకుంటే మానండి!” వారప్పుడు ముప్పై వెండి నాణెములిచ్చారు. 
13 తరువాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “అంటే నా విలువ అంత మాత్రమేనని వారనుకుంటున్నారన్న మాట. ఆ మహాధనాన్ని† ఆలయ ఖజానాలో పడవేయి.” కాపున ఆ ముప్పై వెండి నాణాలను తీసుకొని యెహోవా ఆలయంలోని ఖజానాలో పడవేశాను. 
14 పిమ్మట “సమైక్యత” అనే కర్రను తీసుకొని రెండుగా నరికాను. యూదా, ఇశ్రాయేలులు మధ్యగల ఐక్యతకు భంగం వాటిల్లిందని చూపటానికి నేనిది చేశాను. 
15 పిమ్మట యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు గొర్రెలను కాయటానికి అసలు పనికిరాని ఒక కర్రను చూడు. 
16 ఈ దేశానికి ఒక కొత్త కాపరిని నేను తెస్తానని ఇది చూపుతుంది. కాని ఈ యువకుడు నాశనం కాబడుతున్న గొర్రెలపట్ల జాగ్రత్త తీసుకోలేడు. గాయపడిన గొర్రెలను అతడు బాగు చేయలేడు. బతి కివున్న వాటికి అతడు గ్రాసం‡ ఇవ్వలేడు. ఆరోగ్యంగావున్నవి వూర్తిగా తినబడతాయి. కేవలం వాటి గిట్టలు మాత్రం వదిలి వేయబడతాయి.” 
17 పనికిమాలిన ఓ నా కాపరీ, 
నీవు నా గొర్రెలను వదిలివేశావు. 
అతనిని శిక్షించు! 
అతని కుడి చేతిని, కుడి కంటిని కత్తితో కొట్టు. 
అతని కుడిచేయి నిరుపయోగమవుతుంది. 
అతనికుడి కన్ను గ్రుడ్డిదవుతుంది. 
