94
1 యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు. 
నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు. 
2 నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి. 
గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము. 
3 యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు? 
యెహోవా, ఇంకెన్నాళ్లు? 
4 ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి 
ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు? 
5 యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు. 
నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు. 
6 మా దేశంలో నివసించే విధవరాండ్రను పరదేశస్తులను ఆ దుర్మార్గులు చంపుతారు. 
తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు. 
7 వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు. 
జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబతారు. 
8 దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు. 
మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు? 
దుర్మార్గులారా, మీరు అవివేకులు 
మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి. 
9 దేవుడు మన చెవులను చేశాడు. 
కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు. 
దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి. 
జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు. 
10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు. 
ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు. 
11 ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు. 
ప్రజలు గాలి వీచినట్లుగా వుంటారని దేవునికి తెలుసు. 
12 యెహోవా శిక్షించిన వాడు సంతోషంగా ఉంటాడు. 
సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు. 
13 దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు. 
దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు. 
14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. 
సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు. 
15 న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది. 
అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు. 
16 దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు. 
చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు. 
17 యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే 
నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని. 
18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు. 
కాని యెహోవా తన అనుచరుని బల పరిచాడు. 
19 నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను. 
కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు. 
20 దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు. 
ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు. 
21 ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు. 
అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు. 
22 అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే. 
నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం. 
23 ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు. 
వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు. 
మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు. 
