72
సొలొమోను కీర్తన. 
1 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము. 
రాజకుమారుడు నీ మంచి తనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము. 
2 నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము. 
నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము. 
3 దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము. 
4 పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక. 
నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము. 
5 సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు 
ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను. 
ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను. 
6 పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము. 
నేలమీద పడేజల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము. 
7 అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము. 
చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము. 
8 సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు 
అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము. 
9 అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము 
అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిల పడనిమ్ము. 
10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక. 
షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక. 
11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక. 
రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక. 
12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు. 
మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు. 
13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు. 
రాజు వారిని బతికించి ఉంచుతాడు. 
14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు. 
ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం. 
15 రాజు దీర్గాయుష్మంతుడగును గాక. 
షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక. 
రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి. 
ప్రతిరోజూ అతణ్ణి దీవించండి. 
16 పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక. 
కొండలు పంటలతో నిండిపోవునుగాక. 
పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక. 
పొలాలు గడ్డితో నిండి పోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక. 
17 రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక. 
సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక. 
అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక. 
మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక. 
18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి. అ 
లాంటి అద్భుతకార్యాలు చేయగల వాడు దేవుడు ఒక్కడే. 
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి. 
ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక. 
ఆమేన్, ఆమేన్! 
20 యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం. 
