58
సంగీత నాయకునికి. “నాశనం చేయవద్దు.”దావీదు అనుపదగీతం. 
1 న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు. 
మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు. 
2 లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు. 
ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు. 
3 ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు. 
పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే. 
4 వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు. 
వినతలచని తాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు. 
5 తాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు. 
ఆ దుర్మార్గులు అలాన్నారు. 
6 యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు. 
కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము. 
7 ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక. 
బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక. 
8 మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక. 
చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక. 
9 కుండకింద వున్న నిప్పువేడిలో అతిత్వరగా 
కాలి పోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక. 
10 మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం 
వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు. 
ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు. 
11 అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది. 
లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.” 
