30
దావీ దు కీర్తన.ఆలయ ప్రతిష్ఠ కీర్తన. 
1 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు. 
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను. 
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను. 
నీవు నన్ను స్వస్థపరచావు. 
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు. 
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ* ఉండవలసిన పనిలేదు. 
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి. 
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి. 
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది కానీ ఆయన తన ప్రేమను చూపించాడు. 
నాకు “జీవం” ప్రసాదించాడు. 
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను. 
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను. 
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు. 
నేను ఎన్నటికీ ఓడించబడను. 
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు. 
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు. 
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు. 
మరి నేను చాలా భయపడిపోయాను. 
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను. 
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను. 
9 “దేవా, నేను మరణించి 
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం? 
ధూళి నిన్ను స్తుతిస్తుందా? 
అది నీ నమ్మకమును గూర్చి చెప్పుతుందా? 
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము. 
యెహోవా, నాకు సహాయం చేయుము.” 
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు. 
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు. 
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు. 
12 యెహోవా, నా దేవా నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను. 
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. 
