145
దావీదు ప్రార్థన. 
1 నా దేవా, నా రాజా నిన్ను నేను స్తుతిస్తాను. 
నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను. 
2 ప్రతిరోజూ నిన్న నేను స్తుతిస్తాను. 
ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను. 
3 యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు. 
ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము. 
4 యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు. 
నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు. 
5 ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు. 
నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను. 
6 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు. 
నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను. 
7 నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు. 
యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు. 
8 యెహోవా దయగల వాడు, కరుణగల వాడు. 
యెహోవా సహనంగల వాడు, ప్రేమ పూర్ణుడు. 
9 యెహోవా, అందరి యెడలా మంచివాడు. 
దేవుడ చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు. 
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి. 
నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు. 
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు. 
నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు. 
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు. 
మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు. 
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. 
నీవు శాశ్వతంగా పాలిస్తావు. 
14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు. 
కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు. 
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం సీవైపు చూస్తాయి. 
సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు. 
16 యెహోవా, నీవు నీ గుప్పిడి విప్పి, 
జీవిస్తున్న సకల ప్రాణులకూ వాటికి కావాల్సినవన్నీ యిస్తావు. 
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది. 
యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమ చూపిస్తాడు. 
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు. 
యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు. 
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు. 
యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు. 
మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు. 
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు. 
దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు. 
21 నేను యెహోవాను స్తుతిస్తాను! 
ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక! 
