116
1 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు 
నాకు ఎంతో సంతోషం. 
2 సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర 
ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం. 
3 నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి. 
సమాధి నా చుట్టూరా మూసికొంటుంది. 
నేను భయపడి చింతపడ్డాను. 
4 అప్పుడు నేను యెహోవా నామం స్మరించి, 
“యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను. 
5 యెహోవా మంచి వాడు, జాలిగల వాడు. 
యెహోవా దయగలవాడు. 
6 నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధతీసుకొంటాడు. 
నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు. 
7 నా ఆత్మా, విశ్రమించు! 
యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు. 
8 దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు. 
నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు. 
నేను పడిపోకుండా నీవు నన్ను పట్టికొన్నావు. 
9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను. 
10 “నేను నాశనమయ్యాను!” 
అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను. 
11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే” 
అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను. 
12 యెహోవాకు నేను ఏమివ్వగలను? 
నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు. 
13 నన్ను రక్షించినందుకు 
నేను ఆయనకు పానార్పణం యిస్తాను. 
యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను. 
14 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను. 
ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి యెదుటికి వెళ్తాను. 
15 యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము. 
యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని. 
16 నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను. 
యెహోవా, నీవే నా మొదటి గురువు. 
17 నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను. 
యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను. 
18 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను. 
ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను. 
19 యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను. 
యెహోవాను స్తుతించండి! 
