112
1 యెహోవాను స్తుతించండి. 
యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. 
ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం. 
2 ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు. 
మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు. 
3 ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు. 
అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది. 
4 మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు. 
దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు. 
5 ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చేగుణం కలిగి ఉండటం, అతనికి మంచిది. 
తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది. 
6 ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు. 
ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడుతాడు. 
7 మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు. 
ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు. 
8 ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు. 
అతడు తన శత్రువులను ఓడిస్తాడు. 
9 ఆమనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు. 
అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి. 
10 దుష్టులిది చూచి కోపగిస్తారు. 
వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు. 
దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు. 
