106
1 యెహోవాను స్తుతించండి! 
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. 
దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. 
2 యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు. 
ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు. 
3 దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు. 
ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు. 
4 యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. 
నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 
5 యెహోవా, నీ జనులకు నీవు చేసేమంచి వాటిలో 
నన్ను పాలుపొందనిమ్ము 
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము. 
నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము. 
6 మా పూర్వికుల్లా మేము కూడా పాపం చేసాము. 
మేము తప్పులు చెడుకార్యాలు చేసాము. 
7 యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు. 
నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు. 
కాని, ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి 
విరోధంగా ఎదురు తిరిగారు. 
8 అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు, 
ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని. 
9 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది. 
దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు. 
10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు. 
వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు. 
11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచేశాడు కప్పివేసాడు. 
వారి శత్రువులు ఒక్కరూ తప్పించుకోలేదు! 
12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు. 
వారు ఆయనకు స్తుతులు పాడారు. 
13 కాని దేవుడు చేసిన వాటిని మన పూర్వీకులు వెంటనే మరచిపోయారు. 
వారు దేవుని సలహావినలేదు. 
14 మన పూర్వీకులు ఎడారిలో ఆకలిగొన్నారు. 
అరణ్యంలో వారు దేవుణ్ణి పరీక్షించారు. 
15 కాని మన పూర్వీకులు అడిగిన వాటిని దేవుడు వారకి ఇచ్చాడు. 
అయితే దేవుడు వారికి ఒక భయంకర రోగాన్ని కూడా ఇచ్చాడు. 
16 ప్రజలు మోషే మీద అసూయ పడ్డారు. 
యెహోవా పవిత్ర యాజకుడు అహరోను మీద వారు అసూయపడ్డారు. 
17 కనుక ఆ అసూయాపరులను దేవుడు శిక్షించాడు. భూమి తెరచుకొని దాతానును మింగివేసింది. 
తరువాత భూమి మూసుకొంటూ అబీరాము సహచరులను కప్పేసింది. 
18 అప్పుడు ఒక అగ్ని ఆ ప్రజాసమూహాన్ని కాల్చివేసింది. 
ఆ అగ్ని ఆ దుర్మార్గులను కాల్చివేసింది. 
19 హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను చేశారు. 
వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు. 
20 ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని 
వారి మహిమ గల దేవునిగా మార్చేశారు. 
21 మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు. 
ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు. 
22 హాము దేశంలొ* దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. 
దేవుడు ఎర్ర సముద్రం దగ్గర భీకర కార్యాలు చేశాడు. 
23 దేవుడు ఆ ప్రజలను నాశనం చేయాలని కోరాడు. 
కాని దేవుడు ఏర్పరచుకొన్న సేవకుడు మోషే ఆయనను నివారించాడు. 
దేవునికి చాలా కోపం వచ్చింది. 
కాని దేవుడు ఆ ప్రజలను నాశనం చేయకుండా మోషే అడ్డుపడ్డాడు. 
24 అంతట ఆ ప్రజలు ఆనందకరమైన కనాను దేశంలోనికి వెళ్లేందుకు నిరాకరించారు. 
ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలను ఓడించుటకు దేవుడ వారికి సహాయం చేస్తాడని ఆ ప్రజలు నమ్మలేదు. 
25 మన పూర్వీకులు దేవునికి విధేయులవుటకు నిరాకరించారు. 
26 అందుచేత వారు అరణ్యంలోనే మరణిస్తారని దేవుడు ప్రమాణం చేసాడు. 
27 వారి సంతతివారిని ఇతర ప్రజలు ఓడించేలా చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు. 
మన పూర్వీకులను రాజ్యాలలో చెదరగొడతానని దేవుడు ప్రమాణం చేసాడు. 
28 బయల్పెయోరు దగ్గర దేవుని ప్రజలు బయలు దేవత పూజలో పాల్గొన్నారు. 
చచ్చినవారికి, విగ్రహానికి బలియిచ్చిన మాంసాన్ని దేవుని ప్రజలు తిన్నారు. 
29 దేవుడు తన ప్రజల మీద చాలా కోపగించాడు. మరియు దేవుడు వారిని రోగులనుగా చేసాడు. 
30 కాని ఫీనెహాసు దేవుని ప్రార్థించాడు. 
దేవుడు రోగాన్ని ఆపుచేసాడు. 
31 ఫీనెహాసు చాలా మంచి పని చేసాడు అని దేవునికి తెలుసు. 
మరియు శాశ్వతంగా ఎప్పటికి దేవుడు దీనిని జ్ఞాపకం చేసుకొంటాడు. 
32 మెరీబా వద్ద ప్రజలకు కోపం వచ్చింది. 
మోషేతో ఏదో చెడు కార్యాము వారు చేయించారు. 
33 ఆ ప్రజలు మోషేను చాలా కలవర పెట్టారు. 
అందుచేత మోషే అనాలోచితంగా మాటలు అనేశాడు. 
34 కనానులో నివసిస్తున్న ఇతర రాజ్యాలను నాశనం చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు. 
కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. 
35 ఇశ్రాయేలు ప్రజలు ఇతర ప్రజలతో కలిసి పోయారు. 
ఇతర ప్రజలు చేస్తున్న వాటినే వీరు కూడా చేశారు. 
36 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా తయారయ్యారు. 
ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు పెట్టారు. 
37 దేవుని ప్రజలు తమ స్వంత బిడ్డలను సహితం చంపి 
ఆ బిడ్డలను ఆ దయ్యాలకు బలియిచ్చారు. 
38 దేవుని ప్రజలు నిర్దోషులను చంపివేసారు. 
వారు తమ స్వంత బిడ్డలనెచంపి ఆ బూటకపు దేవుళ్లకు అర్పించారు. 
39 కనుక ఆ ఇతర ప్రజల పాపాలతో దేవుని ప్రజలు మైలపడ్డారు. 
దేవుని ప్రజలు తమ దేవునికి అపనమ్మకస్తులై ఆ ఇతర ప్రజలు చేసిన పనులనే చేసారు. 
40 దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది. 
దేవుడు వారతో విసిగిపోయాడు! 
41 దేవుడు తన ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగించాడు. 
వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా దేవుడు చేసాడు. 
42 దేవుని ప్రజలను శత్రువులు వారిని తమ అదుపులో పెట్టుకొని 
వారికి జీవితాన్నే కష్టతరం చేసారు. 
43 దేవుడు తన ప్రజలను అనేకసార్లు రక్షించాడు. 
కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన వాటినే వారు చేశారు. 
దేవుని ప్రజలు ఎన్నెన్నో చెడ్డపనులు చేసారు. 
44 కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టారు. 
ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు. 
45 దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొన్నాడు. 
దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప ప్రేమతో వారిని ఆదరించాడు. 
46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు. 
అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు. 
47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు. 
నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా 
నా జనముల మద్యనుండి మమ్మల్ని సమీకరించుము. 
కనుక ఆయనకు మనం స్తుతులు పాడగలం. 
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి. 
దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు. 
మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు. 
