పాపులైన గొర్రెల కాపరులు 
23
1 “యూదా కాపరులకు (నాయకులకు) చాలా చెడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రెలను (ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన వాక్కు. 
2 ఆ కాపరులు (నాయకులు) నా ప్రజలకు బాధ్యులు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ కాపరులకు ఈ విషయాలు చెపుతున్నాడు: “ఓ కాపరులారా (నాయకులు), మీరు నా గొర్రెల మందను నలుదిశలా పారిపోయేలా చేశారు. వారు పోవటానికి మీరు ఒత్తిడి తెచ్చారు. మీరు వారిని గురించి శ్రద్ధ వహించలేదు. కాని నేను మీతో వ్యవహరిస్తాను. మీరు చేసిన చెడుకార్యాలకు నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. 
3 “నేను నా గొర్రెల మందను (ప్రజలను) ఇతర దేశాలకు పంపాను. పోయిన నా మందలను (ప్రజలను) నేను చేరదీస్తాను. వాటిని పచ్చిక బయలుకు (దేశానికి) మరల చేర్చుతాను. నా మందలు (ప్రజలు) వాటి పచ్చిక బీటికి (దేశానికి) తిరిగి చేరుకోగానే వాటికి సంతానోత్పత్తి జరిగి, అభివృద్ధి చెందుతాయి. 
4 నా గొర్రెల మందపై నేను కొత్త కాపరులను (నాయకులను) నియమిస్తాను. ఆ కాపరులు నా మంద విషయమై శ్రద్ధ వహిస్తారు. నా మంద బెదరిపోయేలా గాని, జడిసి పోయేలా గాని చేయబడదు. నా మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోదు.” ఇదే యెహోవా వాక్కు. 
నీతియుక్తమైన “అంకురం” (కొత్త రాజు) 
5 “నేనొక నీతి యుక్తమైన అంకురాన్ని* మొలిపింప జేసే సమయం వస్తూవుంది,” 
ఇదే యెహోవా వాక్కు. 
అతడు మంచి తెలివి తేటలతో పరిపాలించగల రాజు. 
దేశానికి ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో అతడది చేస్తాడు. 
6 శుద్ధమైన మంచి బీజోత్పత్తి సమయమందు యూదా ప్రజలు రక్షింపబడతారు. 
ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది. 
“యెహోవా మనకు న్యాయం”† 
అని అతనికి పేరుగా ఉంటుంది. 
7 కావున సమయం ఆసన్నమవుతూ ఉంది ఇదే యెహోవా వాక్కు, “అప్పుడు ప్రజలు ఎంత మాత్రం యెహోవా పేరుమీద పాతవిధంగా ప్రమాణం చేయరు. ‘నిత్యుడగు యెహోవా తోడు’ అనేది ‘ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించి తీసికొని వచ్చిన యెహోవా తోడు’ అనేవి పాత ప్రమాణాలు. 
8 కాని ఇశ్రాయేలు ప్రజలు కొత్త విధంగా ప్రమాణం చేస్తారు. ‘నిత్యుడగు యెహోవా తోడు. యెహోవా తన ప్రజలను ఉత్తర రాజ్యం నుండి విముక్తి చేసి తీసుకొని వచ్చాడు. ఆయన వారిని పంపిన రాజ్యాలన్నిటి నుండి ప్రజలను తిరిగి తీసికొని వచ్చాడు’ అని ప్రజలు చెప్పుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి స్వదేశంలో నివసిస్తారు.” 
దొంగ ప్రవక్తలకు వ్యతిరేకంగా తీర్పు 
9 ప్రవక్తలకు పవిత్రమైన మాటలు: 
నేను విచారంగా ఉన్నాను. నా హృదయం పగిలింది. 
నా ఎముకలు వణుకుతున్నాయి. 
నేను (యిర్మీయా) ఒక తాగుబోతు వ్యక్తిలా ఉన్నాను. 
యెహోవాను బట్టి, ఆయన పవిత్ర వాక్కును బట్టి నేనిలా వున్నాను. 
10 యూదా రాజ్యం వ్యభిచరించే వారితో నిండిపోయింది. 
వారనేక విధాలుగా అనిశ్వాసులై ఉన్నారు. 
యెహోవా రాజ్యాన్ని శపించాడు. 
అందుచే అది బీడై పోయింది. 
పచ్చిక బయళ్లలో మొక్కలు ఎండి చచ్చిపోతున్నాయి. 
పొలాలన్నీ ఎడారుల్లా మారినాయి. 
ప్రవక్తలంతా దుష్టులయ్యారు. 
ప్రవక్తలు వారి శక్తియుక్తుల్ని తప్పుడు విధంగా వినియోగిస్తున్నారు. 
11 “ప్రవక్తలు, యాజకులు కూడా దుష్టులయ్యారు. 
వారు నా ఆలయంలోనే దుష్టకార్యాలు చేయటం నేను చూశాను.” 
ఇదే యెహోవా వాక్కు. 
12  “కావున నా సందేశం ఇక మీదట వారికివ్వను. 
వారి జీవితం బలవంతంగా అంధకారంలో నడిచి నట్లుంటుంది. 
ప్రవక్తలకు, యాజకులకు మార్గం అతి నునుపై జారిపడేలా ఉంటుంది. 
గాఢాంధకారంలో ప్రవక్తలు, యాజకులు జారిపడతారు. 
వారి మీదికి విపత్తును తీసుకొని వస్తాను. 
ఆ సమయంలో ఆ ప్రవక్తలను, యాజకులను శిక్షిస్తాను.” 
ఇదే యెహోవా వాక్కు. 
13 “సమరయ‡ ప్రవక్తలు చెడు చేయటం నేను చూశాను. 
బూటకపు దేవత బయలు పేరిట వారు భవిష్య విషయాలు చెప్పటం నేను చూశాను. 
ఆ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను యెహోవాకు దూరం చేశారు. 
14 యూదా ప్రవక్తలు యెరూషలేములో ఘోరమైన 
పనులు చేయటం నేను చూశాను. 
ఈ ప్రవక్తలు వ్యభిచార దోషానికి పాల్పడ్డారు. 
వారు అబద్ధాలను వింటారు. 
వారు తప్పుడు బోధనలను అనుసరించారు. 
వారు దుర్మార్గులను, చెడు కార్యాలు చేయటానికి ప్రోత్సహించారు. 
అందువల్ల ప్రజలు పాపం చేయటం మానలేదు. 
వారు సొదొమ నగరంవలె ఉన్నారు. 
యెరూషలేము ప్రజలు నా దృష్టిలో 
గొమొర్రా నగరంవలె ఉన్నారు!” 
15 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ ప్రవక్తల విషయంలో ఇలా చెపుతున్నాడు. 
“ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను. 
ఆ శిక్ష విషముతిన్నట్లు, చేదు నీరు తాగినట్లు ఉంటుంది. 
ఆ ప్రవక్తలు ఆధ్యాత్మిక పరమైన 
ఒక రుగ్మతను ప్రబలింప చేశారు. 
ఆ రోగం దేశ వ్యాప్తంగా చెలరేగింది, కావున ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను. 
ఆ రోగం యెరూషలేములోని ప్రవక్తల నుండే సంక్రమించింది.” 
16 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు: 
“ఆ ప్రవక్తలు మీకు చెప్పే విషయాలను మీరు లక్ష్యపెట్టవద్దు. 
వారు మిమ్మల్ని మోసపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. 
ఆ ప్రవక్తలు దర్శనాలను గురించి మాట్లాడతారు. 
కాని వారా దర్శనాలను నానుండి పొందలేదు. 
వారి దర్శనాలన్నీ వారి కల్పనాలే. 
17 కొంత మంది ప్రజలు యెహోవా యొక్క నిజమైన సందేశాలను సైతం అసహ్యించుకుంటారు. 
అందువల్ల ప్రవక్తలు ఆ ప్రజలకు రకరకాల విషయాలు చెపుతారు. 
‘మీకు శాంతి సమకూరుతుంది’ అని వారంటారు. 
కొంత మంది ప్రజలు బహు మొండివారు. 
వారు చేయదలచుకున్నదేదో అదే చేస్తారు. 
కావున వారికి ఆ ప్రవక్తలు, 
‘మీకు ఏ కీడూ రాదు!’ అని చెపుతారు. 
18 కాని ఈ ప్రవక్తలలో ఏ ఒక్కడూ పరలోక సభలో§ నిలవలేదు. 
వారిలో ఏ ఒక్కడూ యెహోవాను గాని, యెహోవా వాక్కును గాని దర్శించలేదు. 
వారిలో ఏ ఒక్కడూ యెహోవా సందేశం పట్ల శ్రద్ధ వహించలేదు. 
19 ఇప్పుడు యెహోవా నుండి శిక్ష తుఫానులావస్తుంది! 
యెహోవా కోపం ఉగ్రమైన గాలి వానలా ఉంటుంది! 
ఆ దుష్టుల తలలు చితికి పోయేలా అది వారి మీదికి విరుచుకు పడుతుంది. 
20 యెహోవా చేయదలచుకున్నదంతా చేసేవరకు 
ఆయన కోపం చల్లారదు. 
అంత్యదినాల్లో దీనిని మీరు 
సరిగా అర్థం చేసికుంటారు. 
21 ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు. 
కాని వారికి వారే తమ వర్తమానాలను చాటటానికి పరుగున పోయారు. 
నేను వారితో మాట్లాడలేదు. 
కాని వారు నా పేరుతో ప్రవచించారు. 
22 వారు నా సర్వ సభలో నిలిచి ఉండినట్లయితే 
వారు నా సందేశాలను యూదా ప్రజలకు చెప్పి ఉండేవారు. 
ప్రజలు చెడు మార్గాలు తొక్కకుండా ఆపేవారు. 
వారు దుష్ట కార్యాలు చేయకుండా ఆపేవారు.” 
23 “ఇక్కడ ఈ స్థలములో నేను దేవుడను. 
నేను దూర ప్రాంతంలో కూడా దేవుడను. 
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం 
నేను దూరంలో లేను! 
24 ఒక వ్యక్తి నాకు నకపడకుండా రహస్య స్థావరంలో దాగటానికి ప్రయత్నించవచ్చు. 
కాని వానిని చూడటం నాకు తేలిక ఎందువల్లనంటే 
నేను స్వర్గంలోను, భూమి మీద సర్వత్రా వ్యాపించి వున్నాను!” 
25 “నా పేరు మీద అబద్ధాలు బోధించే ప్రవక్తలున్నారు. ‘నాకు స్వప్న దర్శనమయింది. నాకు స్వప్న దర్శనమయింది,’ అని వారంటారు. వారు అలా చెప్పటం నేను విన్నాను. 
26 ఎంత కాలం ఇది కొన సాగుతుంది? ఆ ప్రవక్తలు అబద్ధాలనే ఆలో చిస్తారు. వారు ఆలోచించిన అబద్ధాలనే ప్రజలకు భోదిస్తారు. 
27 యూదా ప్రజలు నా పేరు మర్చి పోయేలా చేయటానికి ఆ ప్రవక్తలు ప్రయత్నిస్తున్నారు. వారొకరి కొకరు ఈ దొంగ కలల గురించి చెప్పుకొనటం ద్వారా ఇది సాధించాలని చూస్తున్నారు. తమ పూర్వీకులు నన్ను మర్చిపోయిన రీతిగా, ఇప్పుడు నా ప్రజలు నన్ను మర్చిపోయేలా చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. వారి పూర్వీకులు నన్ను మర్చిపోయి, బూటకపు దేవత బయలును ఆరాధించారు. 
28 ఎండుగడ్డి, గోధుమలు ఒక్కటి గావు! అదే రీతిగా, ఆ ప్రవక్తల కలలు నా సందేశాలు కానేరవు. ఎవరైనా తన కలలను గూర్చి చెప్పుకోదలిస్తే చెప్పవివ్వండి. కాని నా వర్తమానం విన్నవాడు మాత్రం దానిని యదార్థంగా చెప్పాలి. 
29 నా సందేశం అగ్నిలావుంటుంది” ఇదే యెహవా వాక్కు “అది ఒక బండను పగులకొట్టే సమ్మెటలా ఉంటుంది. 
30 “కావున ఆ దొంగ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.”ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “ఈ ప్రవక్తలు ఒకరి నుండి ఒకరు నా మాటలు దొంగిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.** 
31 నేను ఈ దొంగ ప్రవక్తలకు వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారు కల్పించిన మాటలనే వారు ఉపయోగిస్తూ, అది నా సందేశమన్నట్లు నటిస్తారు. 
32 అసత్య దర్శనాలను బోధించే ఈ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారి అబద్ధాల ద్వారా అసత్య ప్రచారాల ద్వారా వారు నా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రజలకు బోధించే నిమిత్తం ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు! నా తరఫున ఏమి చేయటానికీ నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు! యూదా ప్రజలకు వారేరకంగా సహాయపడలేరు.” ఇదే యెహోవా వాక్కు. 
యెహోవా నుండి విషాద వార్త 
33 “యూదా ప్రజలు గాని, ఒక ప్రవక్త గాని, లేక ఒక యాజకుడు గాని నిన్ను పిలిచి, ‘యిర్మీయా, యెహోవా ఏమి ప్రకటిస్తున్నాడు?’ అని అడుగవచ్చు. అప్పుడు వారికి సమాధానంగా, ‘యెహోవాకు మీరే భారంగా†† ఉన్నారు! ఈ పెద్ద భారాన్ని కిందికి విసరి వేస్తాను.’ ఇదే యెహోవా వాక్కు, అని నీవు చెప్పు. 
34 “ఒక ప్రవక్తే గాని, యాజకుడే గాని, లేక ప్రజలలో ఎవ్వరే గాని, ‘ఇది యెహోవా నుండి వచ్చిన ప్రకటన ….’ అని చెప్పితే, అది అబద్ధం. అటువంటి వ్యక్తిని, వాని కుటుంబాన్నంతటినీ నేను శిక్షిస్తాను. 
35 మీరొకరికొకరు ఇలా చెప్పుకోండి, ‘యెహోవా ఏమి సమాధానమిచ్చాడు?’ లేక ‘యెహోవా ఏమి చెప్పాడు?’ 
36 అంతేగాని మరెన్నడు, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం)’ అనే పదాన్ని తిరిగి మరలా వాడరు. ఎందువల్లనంటే యెహోవా సందేశం ఎన్నడూ, ఎవరికీ భారం కాకూడదు. కాని మీరు మన దేవుని మాటలు మార్చివేశారు! ఆయన నిత్యుడైన సర్వశక్తిమంతుడగు యెహోవా! 
37 “మీరు దేవుని సందేశం తెలుసుకొనదలిస్తే ఒక ప్రవక్తను, ‘యెహోవా నీకేమి సమాధానం చెప్పాడు’ అని గాని; ‘యెహోవా ఏమి చెప్పినాడు?’ అని గాని అడగండి. 
38 కాని, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం) ఏమిటి?’ అని అడగవద్దు. మీరామాటలు వాడితే, ‘అప్పుడు యెహోవా మీకు ఈ మాటలు చెప్పుతాడు: “మీరు నా సందేశాన్ని యెహోవా ప్రకటన” (పెద్ద భారం) అని చెప్పకుండా ఉండవలసింది. ఆ మాటలు వాడవద్దని నేను మీకు చెప్పియున్నాను. 
39 కాని నా సందేశాన్ని పెద్ద భారమని పిలిచారు. కావున మిమ్మల్ని పెద్ద భారంలా ఎత్తి నా నుండి విసరి పారవేస్తాను. యెరూషలేము నగరాన్ని మీ పూర్వీకులకు నేను ఇచ్చియున్నాను. కాని మిమ్మల్ని, మీ నగరాన్నీ నా నుండి దూరంగా పార వేస్తాను. 
40 పైగా మీకు శాశ్వతంగా తలవంపులు కలిగేలా చేస్తాను. మీ సిగ్గును మీరెన్నడూ మరువలేరు.’” 
* 23:5: అంకురము దావీదు వంశంలో నుండి ఒక కొత్త రాజు వస్తాడని దీని భావం.
† 23:6: యెహోవా … న్యాయం ఇది ద్వందార్థం. ఇది సిద్కియా పేరు లాటింది. ఈ భవిష్యద్వాణి యివ్వబడినప్పుడు యూదాకి రాజు, కాని యిర్మీయా వేరొక రాజును గురించి పలుకుచున్నాడు.
‡ 23:13: సమరయ ఇది ఇశ్రాయేలు ఉత్తర రాజ్యపు ముఖ్య పట్టణం. ఆ ప్రజలు మిక్కిలి నీచ కార్యాలు చేయటం వలన దేవుడే రాజ్యాన్ని నాశనం చేశాడు. సమరయకు షోమ్రోను మరో పేరు.
§ 23:18: పరలోక సభ పాతనిబంధన గ్రంథంలోని ప్రజలు స్వర్గ సభానాయకునిగా దేవుని చిత్రీకరించి మాట్లాడేవారు. చూడండి రాజులు మొదటి గ్రంథము 22:19-23 యెషయా 6:1-8; యోబు 1-2.
** 23:30: ఈ ప్రవక్తలు … ఉంటారు బహుశా ఆయన నిజమైన ప్రవక్తల మాటలను, భావాలను అనుకరించే దొంగ ప్రవక్తలను గూర్చి చెప్పుచుండవచ్చు. అలా చేయుట ద్వారా వారు నిజమైన మరియు దొంగ ప్రవక్తల మధ్య తేడాను గుర్తించలేని ప్రజలను మోసగిస్తున్నారు.
†† 23:33: యెహోవాకు మీరే భారంగా ఇది ద్వందార్థంగా, వ్యంగంగా వాడిన పదం. హెబ్రీ భాషలో “పెద్ద భారం” అనే పదం, “ప్రకటన” అనే పదం ఒకే రకంగా పలుకుతాయి. ఈ పదాన్ని దైవావేశంలో ప్రకటనలు చేసే అర్థంలో దొంగ ప్రవక్తలు కూడా వాడినారు. అందువల్ల వారి నిజ స్వరూపం బయట పడే రీతిలో యిర్మీయా వ్యంగ్యంగా అదే మాటను వారి పట్ల వాడినాడు. వారి బూటకపు ప్రవర్తనలో వారు దేవునికి భారమయ్యారని భావం.
