దేవుడు మరియు విగ్రహాలు 
10
1 ఇశ్రాయేలు వంశీయులారా యెహోవా చెప్పే మాట వినుము! 
2 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: 
“అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు! 
ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు* నీవు భయపడవద్దు! 
అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు. 
కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు. 
3 ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవి కావు. 
వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్రముక్కల కంటే వేరేమీ కాదు. 
వారి విగ్రహాలను ఒక పనివాడు తన ఉలితో కొట్టి మలుస్తాడు. 
4 వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతారు. 
వాటిని పడిపోకుండా సుత్తులతో 
మేకులు కొట్టి నిలబెడతారు. 
5 బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి. 
వారి విగ్రహాలు మాట్లాడవు. 
వారి విగ్రహాలు నడవలేవు. 
ఆ విగ్రహాలను మనుష్యులు మోయాలి! 
కావున ఆ విగ్రహాలకు భయపడకు. 
అవి నిన్ను ఏమీ చేయలేవు. 
పైగా అవి నీకసలు ఏ రకమైన సహాయమూ చేయలేవు!” 
6 యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు! 
నీవు గొప్పవాడవు! 
నీ నామము గొప్పది మరియు శక్తి గలది. 
7 ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు. 
వారందరి గౌరవానికి నీవు అర్హుడవు. 
ప్రపంచ దేశలలో చాలామంది జ్ఞానులున్నారు. 
కాని వారిలో ఏ ఒక్కడు నీకు సాటిరాడు. 
8 అన్యదేశవాసులు మందబద్ధులు, మూర్ఖులు. 
వారి బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో వచ్చినవి. 
9 వారు తర్షీషు నగరంనుండి వెండిని, 
ఉపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను చేస్తారు. 
విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని వారిచే చేయబడతాయి. 
ఈ విగ్రహాలను నీలి రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు. 
“జ్ఞానులు” ఆ “దేవుళ్ల”ని చేస్తారు. 
10 కాని యెహోవా నిజమైన దేవుడు. 
ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు! 
శాశ్వతంగా పాలించే రాజు ఆయనే. 
దేవునికి కోపం వచ్చి నప్పుడు భూమి కంపిస్తుంది. 
ప్రపంచ రాజ్యాల ప్రజల ఆయన కోపాన్ని భరించలేరు. 
11-12 “ఈ వర్తమానం ఆ ప్రజలకు తెలియజేయుము, 
‘ఆ బూటకపు దేవతలు భూమిని, ఆకాశాన్ని సృష్టించలేదు. ఆ చిల్లర దేవుళ్లు నాశనం చేయబడతారు. 
వారు భూమి నుండి, ఆకాశము నుండి మాయమవుతారు.’”† 
తన శక్తితో భూమిని సృష్టించినది నిత్యుడగు దేవుడే. 
దేవుడు తన జ్ఞాన సంపదచే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు. 
తన అవగాహనతో దేవుడు 
ఆకాశాన్ని భూమిపైన వ్యాపింపజేశాడు. 
13 భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు. 
ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు. 
భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు. 
ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు. 
ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు. 
14 ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు! 
లోహపు పనివారు వారు చేసిన విగ్రహాల చేత మూర్ఖులయ్యారు. 
వారి బొమ్మలు అబద్ధాలకు ప్రతీకలు. 
అవి జడపదార్థములు‡ 
15 ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి. 
అవి హాస్యాస్పదమైనవి. 
తీర్పు తీర్చే కాలంలో 
ఆ విగ్రహాలు నాశనం చేయబడతాయి. 
16 కాని యాకోబు యొక్క దేవుడు§ ఆ విగ్రహాలవంటి వాడు కాదు. 
ఆయన సర్వసృష్టికి కారకుడు. 
ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు. 
ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.” 
నాశనం వస్తూవుంది 
17 మీకున్నదంతా సర్దుకొని వెళ్లటానికి సిద్దమవ్వండి. 
యూదా ప్రజలారా మీరు నగరంలో చిక్కుకున్నారు. 
శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు. 
18 యెహోవా ఇలా చెప్పాడు, 
“ఈ సారి యూదా ప్రజలను ఈ దేశంనుండి వెళ్ల గొడతాను. 
వారికి బాధను, శ్రమను కలుగజేస్తాను. 
వారికి ఒక గుణ పాఠం నేర్పటానికి నేనిదంతా చేస్తాను.”** 
19 అయ్యో నేను (యిర్మీయా) బాగా గాయపడ్డాను 
నా గాయం మానరానిది. 
“ఇది నా రోగం, నేను దానిచే బాధ పడవలసినదే” 
అని నేను తలపోశాను. 
20 నా గుడారం పాడైపోయింది. 
దాని తాళ్లన్నీ తెగిపోయాయి. 
నా పిల్లలు నన్ను వదిలేశారు. 
వారు వెళ్లిపోయారు. 
నా గుడారం మరల నిర్మించటానికి సహాయం చేయుటకు ఒక్కడు కూడా మిగలలేదు. 
నాకు ఆశ్రయం కల్పించటానికి ఒక్కడూ మిగలలేదు. 
21 గొర్రెల కాపరులు (నాయకులు) మందమతులయ్యారు! 
వారు యెహోవాను కనుగొనే ప్రయత్నం చేయరు, 
వారు జ్ఞాన శూన్యులు. 
అందువల్లనే వారి మందలు (ప్రజలు) చెల్లాచెదరై తప్పిపోయాయి. 
22 ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము! 
ఆ పెద్ద శబ్దం ఉత్తర దిశనుండి వస్తూవుంది. 
అది యూదా నగరాలను నాశనం చేస్తుంది. 
యూదా ఒక వట్టి ఎడారిలా మారుతుంది. 
అది గుంట నక్కలకు స్థావరమవుతుంది. 
23 యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు. 
ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను వేసుకోలేరు. 
జీవించుటకు సరైన మార్గం వారికి తెలియదు. 
ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా తెలియదు. 
24 యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము! 
నీవు మమ్ము నశింపజేయవచ్చు 
కాని మాపట్ల నిష్పక్షపాతంగా వుండుము! 
కోపంలో మమ్మల్ని శిక్షించవద్దు! 
25 నీకు కోపంవస్తే, 
అన్యదేశాలను శిక్షించుము. 
వారు నిన్నెరుగరు; గౌరవించరు. 
ఆ ప్రజలు నిన్ను పూజించరు. 
ఆ రాజ్యాలు యాకోబు వంశాన్ని నాశనం చేశాయి. 
వారు ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేశారు. 
వారు ఇశ్రాయేలు యొక్క స్వంత దేశాన్ని నాశనం చేశారు. 
* 10:2: ఆకాశంలో … సంకేతాలు ఆకాశంలో వచ్చే తోక చుక్కలు, ఉల్కలు, సూర్య చంద్ర గ్రహణాల ద్వారా భవిష్యత్తులో ఏమి జరుగబోతూ వున్నదో తెలుసుకోవచ్చునని ప్రజలనమ్మిక.
† 10:11-12: ఈ వర్తమానం … మాయమవుతారు ఈ భాగం అరాము భాషలో వ్రాయబడింది. హెబ్రీలో వ్రాయబడలేదు. ఈ భాషను ఇతర దేశాల వారికి వ్రాసెటప్పుడు వాడేవారు. బబులోనులో కూడా ఈ భాషనే మాట్లాడేవారు.
‡ 10:14: అవి జడపదార్థములు అక్షరార్థముగా “ఆత్మలేనివి” దాని అర్థమేమనగా అవి జీవించి లేవు, లేక దేవుని ఆత్మ వాటిలో లేదు అని.
§ 10:16: యాకోబు యొక్క దేవుడు “యాకోబు భాగము” అని శబ్దార్థం. దేవుడు, ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన సంబంధంగల వారు అని ఇది చూపిస్తుంది. దేవుడు ఇశ్రాయేలుకు సంబంధించిన వాడు. ఇశ్రాయేలు దేవునికి సంబంధించినది.
** 10:18: వారికి … చేస్తాను ఇచ్చట హెబ్రీ భాష మిక్కిలి జటిలంగావుంది.
